ఇవి చదివితే సొంత ఊరిలోనే ఉద్యోగం – ఏపీ ప్రభుత్వ కొత్త అవకాశాలు!

 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి ఉద్యోగాల కల్పన. రాష్ట్రంలో పెట్టుబడులు తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగావకాశాలు పెరగడం కష్టంగా మారింది. అయితే, ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లో నిపుణుల కొరత పెరిగిపోవడంతో, ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచే కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.

ఈ లక్ష్యంతో రాష్ట్రాన్ని ఆరు క్లస్టర్లు, 10 రంగాలుగా విభజించి, ఉమ్మడి జిల్లాల ఆధారంగా ప్రత్యేక నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టింది. పరిశ్రమల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆయా రంగాలకు అనుగుణంగా కోర్సులను అందుబాటులోకి తెస్తున్నారు. ఉదాహరణకు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫార్మా కోర్సులు, గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగానికి సంబంధించిన కోర్సులు, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో టెక్స్‌టైల్ కోర్సులు అందించనున్నారు. అలాగే, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గ్రానైట్, ఆయిల్ ఉత్పత్తికి సంబంధిత కోర్సులు, చిత్తూరు, కర్నూలులో ఎలక్ట్రానిక్స్, విద్యుత్ రంగాలకు సంబంధించిన కోర్సులు, అనంతపురం-కడపలో ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలకు సంబంధిత కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

మరో ప్రధాన సమస్య ఏమిటంటే, పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల వైపు మళ్లడం వల్ల పరిశ్రమల్లో మద్యస్థ స్థాయి ఉద్యోగాల కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులకు స్థానిక పరిశ్రమల్లోనే ఉద్యోగ అవకాశాలు అందించేందుకు అనువైన కోర్సులను ప్రవేశపెట్టారు.

ప్రభుత్వం ఈ కోర్సులను మాత్రమే అందించకుండా, వాటిని పూర్తిచేసిన విద్యార్థులకు ప్రత్యక్ష పరిశ్రమల ద్వారా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు లభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దీని వల్ల యువత దూర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత ఊరిలోనే ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ఆసక్తి చూపించనుంది. ఇదే సమయంలో పరిశ్రమల మానవ వనరుల అవసరాన్ని తీర్చేందుకు కూడా ఈ ప్రణాళిక ఉపయోగపడనుంది.

Post a Comment

0 Comments

Close Menu