Lord Shiva: శివుడి మూడో కన్ను ఎలా వచ్చింది? ఈ పురాణ కథలు తెలుసా?

 


శివుడి మూడో కన్ను ఎలా వచ్చింది? ఈ పురాణ కథలు తెలుసా?

శివుడు, భోలే నాథ్, పరమేశ్వరుడు, రుద్రుడు, మహాదేవుడు – ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకునే ఆదియోగి శివుడు ఎన్నో వింత విశేషాలతో భక్తులను ఆకర్షిస్తాడు. ఆయన మెడలో సర్పం, చేతిలో త్రిశూలం, శరీరంపై బూడిద, ఎప్పుడూ ధ్యానంలో లీనమై ఉండే రూపం ఆయన విశేషమైన స్వభావాన్ని తెలియజేస్తాయి. కానీ, శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? ఈ ప్రశ్న చాలా మందిని ఆకట్టుకుంటుంది. పురాణాలలో ఈ విషయంపై ఎన్నో కథలు ఉన్నాయి. అయితే, ప్రధానంగా రెండు కథలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి.

పార్వతీదేవి కారణంగా శివుడికి మూడో కన్ను

ఒకరోజు శివుడు గాఢ ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు. అదే సమయంలో పార్వతీదేవి తన భర్తను ఆటపట్టించేందుకు వెనకనుంచి వెళ్లి ఆయన రెండు కన్నులను కప్పేస్తుంది. శివుడి ఎడమ కన్ను చంద్రుడికి, కుడి కన్ను సూర్యుడికి ప్రతీకగా ఉంటాయి. పార్వతి ఆ కన్నులను మూయడంతో మూలోకాలు చీకటిలో మునిగిపోతాయి. ఈ పరిస్థితి దేవతలు, మానవులు, రాక్షసులందరికీ భయాందోళనకు గురిచేస్తుంది.

ఈ విపత్కర పరిస్థితిని తట్టుకోవడానికి శివుడు తనలోని శక్తిని నుదుటిలో సమీకరించి, ఒక అగ్ని కణాన్ని ఉద్భవింపజేస్తాడు. అదే శివుని మూడో కన్నుగా మారింది. ఆ కన్ను తెరిచిన క్షణమే మళ్లీ ప్రపంచానికి వెలుగు ప్రసరించింది. పురాణాల ప్రకారం, ఈ అగ్నికణాల వేడితో పార్వతీదేవి చెమటపట్టగా, ఆ చెమట చుక్కల నుంచి అంధకాసురుడు జన్మించాడని చెబుతారు.

శివుడు మూడో కన్ను పొందటానికి మరో కథ

ఇంకో కథ ప్రకారం, ఆదిపరాశక్తి త్రిమూర్తులను – బ్రహ్మ, విష్ణు, శివుడిని – సృష్టించిన తర్వాత, వారిలో ఒకరు తనను వివాహం చేసుకోవాలని కోరింది. అయితే, ముగ్గురు త్రిమూర్తులు దీనికి అంగీకరించలేదు. దీంతో ఆదిపరాశక్తి ఆగ్రహించి తన మూడో కన్ను తెరిచి వారిని భస్మం చేస్తానని శపించింది.

ఈ సంక్షోభాన్ని నివారించేందుకు శివుడు ముందుకు వచ్చి, "మీ మూడో కన్నును నాకు ప్రసాదిస్తే, నేను నిన్ను వివాహం చేసుకుంటాను" అని ఆదిపరాశక్తిని కోరాడు. ఆమె అంగీకరించి ఆ మూడో కన్నును శివునికి ప్రసాదించింది. మూడో కన్ను పొందిన వెంటనే, శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేశాడు. ఆ బూడిదలో మూడు భాగాలను భగవతిగా మార్చాడు – పార్వతిగా, లక్ష్మిగా, సరస్వతిగా.

శివుని మూడో కన్ను మహత్యం

శివుడి మూడో కన్ను విజ్ఞానాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని సూచిస్తుంది. ఇది ఆత్మజ్ఞానానికి, తపస్సుకు, యోగానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, ఈ కన్ను తెరిచిన వెంటనే శివుని కోపానికి గురైనదంతా భస్మమైపోతుంది. అందుకే, శివుడు తన మూడో కన్నును అత్యవసర సందర్భాల్లో మాత్రమే తెరుస్తాడు.


శివుని మూడో కన్ను కలిగిన అర్థాలు, దాని వెనుక ఉన్న కథలు మనం పురాణాల ద్వారా తెలుసుకోగలం. ఇది కేవలం శివుని శక్తిని మాత్రమే కాకుండా, విశ్వానికి వెలుగునిచ్చే దివ్య దృష్టిని కూడా సూచిస్తుంది. ముక్కంటి శివుని ఈ తత్త్వం, ఆయన మూడో కన్ను వెనుక ఉన్న కథలు భక్తులకు అర్ధం చేసుకోవడానికి, జీవితంలో ధర్మాన్ని పాటించడానికి మార్గదర్శకంగా ఉంటాయి.

#Shiva #ThirdEyeOfShiva #ShivaStories #HinduMythology #SpiritualKnowledge

Post a Comment

0 Comments

Close Menu