అమరావతిలో భూకేటాయింపులు: కొనసాగుతూనే ఉంటాయి - మంత్రుల కమిటీ




**అమరావతిలో భూకేటాయింపులు: కొనసాగుతూనే ఉంటాయి - మంత్రుల కమిటీ**


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో భూకేటాయింపులు కొనసాగుతాయని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పయ్యావుల కేశవ్‌, కొల్లు రవీంద్ర, టీజీ భరత్‌, కందుల దుర్గేశ్‌ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, "గతంలో కేటాయించిన భూములను అలాగే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. మొత్తం 131 మందికి భూములు కేటాయించాం. 31 సంస్థలకు భూమి కేటాయింపులు కొనసాగుతాయి, రెండు సంస్థలకు కొత్త ప్రదేశాల్లో భూములు కేటాయిస్తాం. 16 సంస్థలకు స్థలాన్ని మార్చామని" తెలిపారు.


**భూకేటాయింపుల విధానం**


"2014 నుండి 2019 వరకు, రైతులు సుమారు 34,000 ఎకరాలు భూమి అందించారు. రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచాం. రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణాలు చేపట్టాం. సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, మూడు రాజధానుల విధానంతో అమరావతి నిర్మాణం నిలిచిపోయింది. NDA ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించింది. మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్యపై దృష్టి పెట్టాం. 8 నెలలు కృషి చేసి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాం. రూ.48 వేల కోట్ల టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆయా సంస్థలు పనులు ప్రారంభిస్తాయి," అని నారాయణ వివరించారు.


**పయ్యావుల కేశవ్‌ అభిప్రాయం**


"అమరావతి స్వీయ ఆధారిత ప్రాజెక్టు. సీఆర్‌డీఏ నిధులను సమకూర్చుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా సపోర్ట్ అందిస్తున్నాం. ఈ నిధులు రుణాల రూపంలో సమకూర్చి ఇస్తున్నాం. అమరావతి నిర్మాణంలో ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి భవిష్యత్తులో అభివృద్ధి అయిన తర్వాత భూములను అమ్మి అప్పులు తీర్చడానికి డిజైన్‌ చేశాం.


రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. మాజీ సీఎం జగన్‌ లక్షల కోట్లు కావాలని అన్నారు. నిజానికి, సీఆర్‌డీఏ ద్వారా నిధుల సమీకరణ జరుగుతోంది. అభివృద్ధి కార్యకమాలు సీఆర్‌డీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. భవిష్యత్తులో అభివృద్ధి అయిన తరువాత సీఆర్‌డీఏనే రుణాలు తీర్చుకుంటుంది. ప్రజలను మభ్యపెట్టారు. వారి జీవితాలతో ఆడుకున్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఇతర జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టగలిగేవారు" అని పయ్యావుల పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu